తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఫుల్లుగా వర్షాలు కురిశాయి. సాధారణ వర్ష పాతం కంటే దాదాపు 40 శాతం అధికంగా వర్షం కురిసింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కురవాల్సిన కంటే ఎక్కువగానే వర్షం కురిసింది. సెప్టెంబర్ చివరి వారంలోనూ కుమ్మేసిన వరుణుడు.. సీజన్ ముగిసినా బ్యాటింగ్ ఆపడం లేదు. అక్టోబర్ లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
మరోవైపు బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావం ఏపీలో తీవ్రంగా ఉండనుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో కుండపోతగా.. దక్షిణ తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.