పేద, మధ్య, ధనిక వర్గాలు, కుటుంబాలు అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, యూనిక్ నెంబర్ తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్ధేశ్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత మేరకు వారికి మేలు చేయాలన్న సంకల్పంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తున్నామని వెల్లడించారు.
అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ కార్డులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, వాస్తవానికి దగ్గరగా జాగ్రత్తగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో చీఫ్ సెక్రెటరీ శ్రీమతి శాంతి కుమారి తో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (యూడిఏ), ఎల్‌ఆర్‌ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ధాన్యం కొనుగోళ్ళు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ల తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ ఫ్యామిలి డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాలలోని 238 ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని ఇప్పటికే ఈ ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని, ఒకవేళ పూర్తిగా పట్టణ / నగర నియోజకవర్గాలైతే రెండు వార్డులు / డివిజన్లు ఎంచుకోవాలని సూచించారు. ఈ నెల మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో (డోర్-టు-డోర్) వివరాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు గాను ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మండలానికి ఒక తహశీల్దారును కూడా నియమిస్తున్నట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు చేర్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్త్ కార్డుల విధానం, అమలు వాటి ఫలితాలపై తెలంగాణ అధికారుల బృందం మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలలో పర్యటించి ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ సబ్-కమిటీకి నివేదిక అందజేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగానే పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని ఈ నెల మూడవ తేదీన ఈ పైలట్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని వెల్లడించారు.ఈ పైలట్ ప్రాజెక్టులో ఎదురయ్యే మంచి చెడులను, పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
గత నాలుగు సంవత్సరాలనుంచి లక్షలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదని, కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉంటే పదుల సంఖ్యలో పరిష్కరించడం పట్ల మంత్రిగారు అసంతృప్తి వ్యక్తం చేశారు.అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడిఏ)ల పరిధి పెంపు, కొత్త యూడిఏల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే కలెక్టర్లు పంపించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, ఇందులో కొన్ని మాత్రమే పూర్తి అయ్యాయని, ఈ పూర్తి అయిన ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేసి దసరా లోపు వారికి అప్పగించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్-చార్జ్ మంత్రి ఛైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా మరికొంతమంది సభ్యులతో కమిటీ ని ఏర్పాటు చేస్తామన్నారు.