తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం పూర్తిగా కలుషితం అయిందనే టాక్ వస్తోంది. మాగనూరు జడ్పీ హైస్కూల్ లో వారం రోజుల్లోనే మూడు సార్లు అన్నం తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గురుకులంలో కలుషిత ఆహారం తిని శైలజ అనే విద్యార్థిని ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఈ ఘటనలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా స్కూళ్లు, హాస్టళ్లలో కల్తీ తీరు మాత్రం మారడం లేదు.
ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక రావడం కలకలం రేపుతోంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే. మహబూబ్ నగర్ లోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక వచ్చింది. ఈ విషయమై వంట సిబ్బందిని అడిగితే ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించారు వంట సిబ్బంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంబారులో బొద్దింక వచ్చిందంటే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని మండి పడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు.