రాజకీయ నేతలు రాజకీయంగా విమర్శలు చేసుకున్నా ఇతరత్రా కార్యక్రమాల్లో మాత్రం కలుస్తూనే ఉంటారు. గతంలో ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ లీడర్లు సరదగానే ఉండేవారు. కాని ఇటీవల కాలం ఆ ట్రెండ్ మారిపోయింది. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. సమైక్య రాష్ట్రంలో బద్ద విరోదులుగా ఉన్నా వైఎస్సార్, చంద్రబాబు ఎదురుపడినప్పుడు కరచాలనం చేసుకునేవారు. కాని చంద్రబాబు, జగన్ మధ్య ఆ వాతావరణం లేదు. ఒకరికి ఒకరు ఎదురుగా వచ్చే పరిస్థితులు కూడా లేవు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జానారెడ్డి, భట్టి, ఉత్తంలతో కేసీఆర్ బాగానే ఉంటారు. కాని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో మాత్రం అలాంటి సీన్ లేదు. ఇక రేవంత్- కేటీఆర్ మధ్య.. ఏపీలో జగన్, చంద్రబాబుకు మధ్య ఉన్న పరిస్థితే ఉంది.
ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ట్విట్టర్ టిల్లు, ఫాంహౌజ్ బాబు వంటి పదాలతో పాటు వ్యక్తిగతంగా కేసీఆర్, కేటీఆర్ ను ఏకిపారేస్తున్నారు రేవంత్ రెడ్డి. అటు కేటీఆర్ కూడా గుంపు మేస్త్రీ, చిట్టి నాయుడు అంటూ రేవంత్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా కేసీఆర్, కేటీఆర్ ను తిట్టకుండా వదలరు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతూనే… కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ పరుష పదజాలం వాడుతుంటారు. సీఎం అయ్యాక కూడా ఆయన తిట్లు తగ్గలేదు. ఇటు కేటీఆర్ కూడా అంతే. సీఎం అయినా, రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నా మాటల తూటాలు ఆగలేదు. రేవంత్ రెడ్డిని ఎక్కడ దొరుకుతారా…? అన్నట్లుగా కేటీఆర్ అండ్ టీం వెయిట్ చేస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు.
అలాంటిది ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఇటీవలే చనిపోయారు. ఆయన సంతాప సభను ఈ నెల 21న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కు కూడా ఆహ్వానం అందించారు సీపీఎం పార్టీ నేతలు. వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సైతం ధృవీకరించారు.దీంతో ఏచూరి సంస్మరణ సభలో ఒకే వేదికపై కనిపించబోతున్నారు రేవంత్, కేటీఆర్. ఈ వార్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది. వాళ్లిద్దరకు కలిస్తే ఎలా ఉంటారు.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా లేదా.. వేదికపై మాట్లాడుకుంటారా లేదా అన్న విషయాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.