తెలంగాణ

లగచెర్లకు జాతీయ ఎస్టీ కమిషన్.. రేవంత్ సర్కార్ టెన్షన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఫార్మా రగడ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.లగచెర్ల గిరిజనుల పోరాటం, అరెస్టులు.. లంబాడీలపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ దృష్టి సారించింది. రాష్ట్రంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనుంది.

మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్లోని లగచర్లకు వెళ్లి రైతులు, గిరిజనులతో సమావేశం కానుంది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. పోలీసుల దాడికి సంబంధించి వివరాలు సేకరించనుంది.అనంతరం కలెక్టర్ పై దాడి కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న వారిని కలవనుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడే బస చేయనుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటనతో తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కలవరం కనిపిస్తోంది. తమపై పోలీసులు దాడి చేశారని బాధితులు చెబితే.. కొందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు లగచెర్ల బాధితులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తో పాటు జాతీయ మానవహక్కుల సంఘంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు.ఇక లగచర్ల దారుణాలను జాతీయ మీడియా ముందు చూపించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొడంగల్ లగచర్ల బాధితుల కోసం ఢిల్లీకి వెళ్లారు కేటీఆర్. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశత్వాన్ని బహిర్గతం చేస్తామంటోంది బీఆర్ఎస్. ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ సర్కార్ బలవంతపు భూసేకరణ చేస్తోందని.. గిరిజనులు, దళితులు, ఓబీలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని చెప్పనుంది.

 

 

Back to top button