ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదలైన కవిత సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. 166 రోజుల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెడుతున్నారు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత. అన్న కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో కలిసి కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నారు. దాదాపు 6 నెలల తర్వాత జైలు నుంచి రిలీజై హైదరాబాద్ వస్తున్న కవితకు గ్రాండ్ వెల్ కం చెప్బబోతున్నారు బీఆర్ఎస్ , జాగృతి నేతలు, కార్యకర్తలు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత కోసం విమానాశ్రయానికి రానున్నారు. జాగృతికి సంబంధించి అన్ని జిల్లాల నేతలు వస్తున్నారు. శంషాబాద్ నుంచి కవిత ఇంటి వరకు ర్యాలీ జరగనుంది. ర్యాలీ తర్వాత తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు కవిత ఎర్రవల్లి ఫాంహౌజ్ వెళ్తారని తెలుస్తోంది. కవిత రాకతో బీఆర్ఎస్ కేడర్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. హైదరాబాద్ మొత్తం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఫైటర్ కంబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వేశారు.
తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి విడుదైన అనంతరం ఎమ్మెల్సీ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగంతో మాట్లాడారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానన్నారు. తనను అన్యాయంగా జైలుకు పంపించారన్న కవిత.. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.