తెలంగాణ

రేవంత్ రెడ్డికి మేథావుల షాక్.. మార్చాలంటూ రాహుల్ కు బహిరంగ లేఖ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మేధావి వర్గం షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసింది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని.. మార్చాలని రాహుల్ ను అభ్యర్థించారు. కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవులు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయమని తమ లేఖలో రాహుల్ గాంధీకి స్పష్టం చేశారు తెలంగాణ మేధావులు.

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ మేధావులు రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖ.. ఉన్నది ఉన్నట్లుగా మీ కోసం..

తెలంగాణ అస్తిత్వ వైభవానికీ, స్వరాష్ట్ర ప్రతిపత్తికీ, స్వాభిమానానికీ, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదు, తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెళ్ళ వెంకటరామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలూ, పాటలూ రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందింది. సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా, సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగుతల్లిని నిలిపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బుద్ధిజీవులూ, సాహిత్యకారులూ, కళాకారులూ తెలంగాణ తల్లి రూపురేఖలను గురించి చర్చించటం ప్రారంభించారు. చర్చల పర్యవసానంగా తెలంగాణ తల్లి ఇప్పుడున్న విధంగా రూపుదాల్చింది. ఉద్యమకారులు స్వచ్ఛందంగా తెలంగాణ ఎల్లెడలా వేలాది విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. కనుక తెలంగాణ తల్లి ఈ మట్టిలోనుంచి, తెలంగాణ ఉద్యమ భావోద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీక.

Read More : ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం.. ఆర్టీసీ రాఖీ రికార్డ్ 

సమైక్య రాష్ట్ర అస్తిత్వ ప్రతీకగా తెలుగుతల్లి విగ్రహం గతంలో సెక్రటేరియట్ ముందు ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి నూతన సెక్రటేరియట్ భవనం కూడా నిర్మాణమైన నేపథ్యంలో, నేడు తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటం చారిత్రక న్యాయం. సెక్రటేరియట్ కు అమరవీరుల స్మారక కేంద్రానికి మధ్యనున్న స్థలంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయుల పక్షాన శ్రీరాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టాల్సిన చోట భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన పట్ల మాకు అభ్యంతరాలున్నాయని తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది. నగరంలో ఆయన విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పట్ల మాకేమీ అభ్యంతరం లేదు. అయితే, సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి ఉండవలసిన చోట కాకుండా మరెక్కడైనా ప్రతిష్ఠించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నెలకొల్పినప్పుడే తెలంగాణ అస్తిత్వ ప్రతీకకు కావాల్సిన సాధికారత, ప్రతిపత్తి సిద్ధిస్తుంది. తెలంగాణ చరిత్రతో గానీ పరిణామాలతో గానీ ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టడం ద్వారా తెలంగాణ భావోద్వేగాలను గాయపర్చవద్దని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో మీరు తెలంగాణ సాంస్కృతిక ఆకాంక్షలను గౌరవిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంటూ సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు సూచించాలని కోరుకుంటున్నాం.

తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక ఆకాంక్షలకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాం.

అభినందనలతో…
ప్రొఫెసర్ హరగోపాల్
టంకశాల అశోక్
అల్లం నారాయణ
గోరెటి వెంకన్న
మల్లేపల్లి లక్ష్మయ్య
నందిని సిధారెడ్డి
అయాచితం శ్రీధర్
పరాంకుశం వేణుగోపాల స్వామి
నాళేశ్వరం శంకరం
దేశపతి శ్రీనివాస్
ఘంటా చక్రపాణి
కట్టా శేఖర్ రెడ్డి
తిగుళ్ళ కృష్ణమూర్తి
కూతురు శ్రీనివాస్ రెడ్డి
వెంకట్ వర్దెల్లి
ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
రసమయి బాలకిషన్
సంగిశెట్టి శ్రీనివాస్
ఏలె లక్ష్మణ్
శ్రీధర్ రావు దేశ్ పాండే
బుద్ధా మురళి
ఎస్జీవీ శ్రీనివాస్ రావు
అనిశెట్టి రజిత
ఐనంపూడి శ్రీలక్ష్మి
కొమర్రాజు రామలక్ష్మి
శ్రీదేవి మంత్రి
రాజ్యశ్రీ కేతవరపు
మంగళంపల్లి విశ్వేశ్వర్
పెద్దింటి అశోక్ కుమార్
వేముగంటి మురళి
కందుకూరి శ్రీరాములు
మల్లావఝుల విజయానంద్
డాక్టర్ ఆంజనేయ గౌడ్
బద్రి నర్సన్
శ్రీరామోజు హరగోపాల్
రమేశ్ హజారి
కాంచనపల్లి
నవీన్ ఆచారి
జూలూరి గౌరీశంకర్
వఝుల శివకుమార్
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
వేముగంటి మురళీకృష్ణ
ధ్యావనపల్లి సత్యనారాయణ
పెన్నా శివరామకృష్ణ
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
లక్ష్మణ్ గౌడ్
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
వనపట్ల సుబ్బయ్య
లక్ష్మణ్ మురారి (బందూక్)
కార్టూనిస్ట్ మృత్యుంజయ్
చిమ్మని మనోహర్
ఎదిరెపల్లి కాశన్న
డా.ఎ.జయంతి
స్వర్ణ కిలారి
బోల యాదయ్య
కె.వీరయ్య
యన్.బాల్ రాం
ఉప్పరి తిరుమలేష్
అమర్ నాథ్
చిక్కొండ్ర రవి
బైరోజు చంద్రశేఖర్
బైరోజు రాజశేఖర్
బైరోజు శ్యాంసుందర్
వహీద్ ఖాన్
వేదార్థం మధుసూదన శర్మ
ఆర్.రత్నాకర్ రెడ్డి,
సి.హెచ్.ఉషారాణి
బెల్లంకొండ సంపత్ కుమార్
పొన్నాల బాలయ్య
కె.అంజయ్య
సిద్దెంకి యాదగిరి
చమన్ సింగ్
కె.రంగాచారి
తైదల అంజయ్య
నాగిళ్ల రామశాస్త్రి
హిమజ్వాల (ఇరివెంటి వెంకట్రమణ)
ఘనపురం దేవేందర్
వీరేంద్ర కాపర్తి
ప్రగతి
పరదా వెంకటేశ్వర్ రావు
ఆచార్య పిల్లలమర్రి రాములు
సంగాని మల్లేశ్వర్.

Back to top button