హైదరాబాద్ మహానగర్ అభివృద్ధిపై ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్ వేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు ప్యాకేజ్లుగా చేపట్టనున్న నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబీఆర్ పార్కు చుట్టూ 826 కోట్ల రూపాయలతో 6 జంక్షన్ల నిర్మాణం జరపనున్నారు. మొదటి ప్యాకేజీ కింద రెండు ఫ్లైఓవర్లు, మూడు అండర్ పాసులు నిర్మించనుంది. సెకండ్ ప్యాకేజిలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. ఇందులో నాలుగు ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తొలగనున్నాయి.
మొదటి ప్యాకేజిలో 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్‌లో రోడ్ నంబర్ 45 నుంచి కేబీఆర్ పార్కు, యూసుఫ్‌గూడ వెళ్లే రూట్‌లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు. కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 36 వైపు నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్ నంబర్45 జంక్షన్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ కట్టనున్నారు. కేబీఆర్ పార్కు ఎంట్రన్స్, ముగ్ధా జంక్షన్లలో చూస్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు మూడు లేన్ల యూని డైరెక్షన్ల, కేసీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు.
రెండో ప్యాకేజిలో 405 కోట్లతో రోడ్ నంబర్ 45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్, మహారాజా అగ్ర సేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రోడ్ నంబర్ 45 జంక్షన్‌లో ఫిలిం నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు రెండు లేన్ల అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 45 వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే ఫిలిం నగర్ జంక్షన్‌లో మహారాజా అగ్ర సేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు రెండు లేన్ల అండర్‌పాస్, ఫిలిం నగర్ జంక్షన్ నుంచి మహారాజా అగ్ర సేన్ జంక్షన్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.