తెలంగాణ

రేవంత్‌‌ను సీఎం పదవి నుంచి దించేందుకే అల్లర్లు!

తెలంగాణలో వరుసగా ఉద్రిక్తత తలెత్తె పరిణామాలు జరుగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు తీవ్ర దుమారం రేపాయి. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అయ్యారు. విపక్షాలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా.. జనాలు కూడా ఫైరయ్యారు. మూసీ సుందరీకరణ కూడా వివాదాస్పదమైంది. గ్రూప్ 1 పరీక్షల వాయిదా కోసం దాదాపు రెండు వారాల పాటు పోరాటం చేశారు అభ్యర్థులు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్ దద్దరిల్లింది. ఈ విషయంలోనూ విపక్షాలు ముఖ్యమంత్రిని టార్గెట్ చేశాయి. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం పెద్ద రచ్చే రాజేసింది. హిందూసంఘాల ఆందోళన టెన్షన్ పుట్టించింది. ఈ విషయంలో హిందూ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డాయి.

రాష్ట్రంగా వరుసగా జరుగుతున్న అన్ని ఘటనల్లోనూ సీఎం రేవంత్ రెడ్జే విపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నా కాంగ్రెస్ ముఖ్య నేతలు, మంత్రులు ధీటుగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ విషయాన్ని చెబుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డికి గండం పొంచి ఉందనే టాక్ వస్తోంది.

సీఎం లను మార్చేందుకు మతకలహాలు సృష్టించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు ఎంపీ ఈటల రాజేందర్. శవాలపై రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. మర్రి చెన్నారెడ్డి ని దించాలని మతకలహాలు సృష్టించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు అనేక ప్రాంతాల్లో బాంబులు పేలాయన్నారు. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్ కు అలవాటన్నారు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారని తెలిపారు. ఇప్పుడు కూడా తెలంగాణలో అలాంటే కుట్రలు జరుగుతున్నాయా అని ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేశారు.

అటు బండి సంజయ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించాలని కాంగ్రెస్ లోనే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. హైడ్రా నిరసనలు.. మూసీ సుందరీకరణ గొడవ, గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావాలని కొందరు కాంగ్రెస్ నేతలే కోరుకుంటున్నారని చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి తరహా ఘటనలు ఇంకా జరగాలని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం పదవి కోసం కొందరు కాంగ్రెస్ నేతలు గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్నారని.. అందులో భాగంగానే నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేశారని అన్నారు.

ఇద్దరు కీలక నేతలు ఇలా మాట్లాడటంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజంగానే రేవంత్ రెడ్డి పదవికి సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందా?.. సీఎం పదవి కోసం గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్నదెవరు? మతకల్లోలాకు కుట్ర చేస్తున్నది ఎవరు? అన్న చర్చ సాగుతోంది.

Back to top button