క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కొన్ని రోజులుగా మల్లారెడ్డి కాలేజీల చుట్టే రాజకీయం సాగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ చేసిందనే వార్తలు వచ్చాయి. చెరువు భూముల్లో కట్టిన మల్లారెడ్డి కాలేజీలను హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా సీఎం రేవంక్ రెడ్డిపై మల్లారెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చారు. తన కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఢిల్లీలో చక్రం తిప్పారు. ఏకంగా యూజీసీ నుంచి అనుమతులు తెచ్చుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. విషయం తెలిసిన తెలంగాణ సర్కార్ మాజీ మంత్రి మల్లారెడ్డి తీరుపై సీరియస్ గా స్పందిస్తోంది.
మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్శిటీ హోదాను ఇస్తూ ఇటీవల యూజీసీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీతో సంబంధం లేకుండా ప్రత్యే కేటగిరీ కింద డీమ్డ్ హోదా ఇచ్చింది. యూజీసీ నిర్ణయంతో మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఉండదు. మెడికల్ సీట్లకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మల్లారెడ్డ కాలేజీలకు యూజీసీ హోదా ఇవ్వడంపై రేవంత్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీరుపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. మల్లారెడ్డి కాలేజీల విషయంలో అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై కాళోజీ యూనివర్సిటీ అధికారులతో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రివ్యూ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు యూజీసీ ఇచ్చిన డీమ్డ్ యూనివర్శిటీ హోదాను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో ఆ దిశగా యూజీసీపై ఒత్తిడి తేవడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
Read More : కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి!ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ సిగ్నల్
మల్లారెడ్డి కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు, 150 డెంటల్ సీట్లు ఉన్నాయి. ఇందులో సగం సీట్లను ఇప్పటివరకు కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్‌లో మెరిట్ ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ సీట్లు దక్కేవి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు. కానీ యూజీసీ డీమ్డ్ యూనివర్శిటీ హోదా ఇవ్వడంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు.