వరద సహాయక చర్యలు, బాధితులను ఆదుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం వరద బాధితులు కూడా తమ దగ్గరకు ఏ అధికారి రాలేదని చెబుతున్నారు. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు హెలికాప్టర్ కావాలని కోరినా ప్రభుత్వం సమకూర్చలేదనే ఆరోపణలు వస్తున్నాయి. చివరికి జేసీబీ డ్రైవర్ సాహసం చేసి ఆ తొమ్మిది మందిని తీసుకొచ్చారు. మరో ఇంటిపై చిక్కుకున్న ముగ్గురు.. హెలికాప్టర్ తో తమను కాపాడాలని కోరుకున్నా జరగలేదు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సహాయ చర్యల కోసం రెండు హెలికాప్టర్లు పంపిస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. తెలంగాణ నుండి వరదలపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేంద్రం తెలిపింది. తెలంగాణలో వచ్చిన వరదల విపత్తుపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపింది కేంద్ర హోంశాఖ.రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందించడానికి రెండు హెలికాప్టర్లను, ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, పడవలను పంపించామని వెల్లడించింది.
తెలంగాణకు రెండు హెలికాప్టర్లను పంపించి.. హకీంపేటలో ఉంచింది కేంద్ర ప్రభుత్వం.రోజూవారి నివేదికను పంపేలా అధికారులను ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది కేంద్ర హోంశాఖ. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్.రెండు బృందాలుగా ఏర్పడి బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుంది.. ఈటెల బృందం ములుగు, మహబూబాబాద్‌లో పర్యటిస్తుంది.