రుణమాఫీ రాలేదంటూ రైతులు ఆందోళనలు చేస్తుండటంతో మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. రుణమాపీ కాని రైతులకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు లోన్ మాఫీ కాలేదన్నారు మంత్రి పొంగులేటి. రుణమాఫీ కానీ రైతులకు ఒక కటాఫ్ డేట్ ఫిక్స్ చేసి లోన్ మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం 31 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువైనా భరించటానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. రుణమాఫీ కానీ రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు బీఆర్ఎస్ నేతల మాటలు వినొద్దని.. రుణమాఫీపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ లీడర్లకు లేదని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదని పొంగులేటి సెటైర్లు వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా తూతూ మంత్రంగా కాకుండా రైతుల రుణ విముక్తే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసిందన్నారు. ధనిక తెలంగాణ అని చెప్పి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో తాం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర అప్పు 7.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉందన్నారు.7 లక్షల కోట్ల అప్పులున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేశారు.
రైతు రుణమాఫీ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ భూములు అమ్మేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల్లాగా మాకు అబద్ధాలు చెప్పడం రాదన్న పొంగులేటి.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. మిగితా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.