క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను సోమవారం నుండి ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనుంది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది. వారి వద్దకు వెళ్తే పేషెంట్ల వివరాలను సీఎంఆర్ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా? కాదా? అనే వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు. సీఎంఆర్‌ఎఫ్ అమలును పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్‌సైట్ ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు.
Also Read : రోడ్డుపై వింత చేపలు.. చూసేందుకు ఎగబడిన జనం!!
ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత సహాయ నిధికీ సంబంధించిన కోడ్ ఇవ్వబడుతుంది. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపబడుతుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు ఆమోదించి లబ్దిదారునికి చెక్కు సిద్ధం చేయబడుతుంది. దరఖాస్తుదారు ఖాతా సంఖ్య చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు.
ఇవి కూడా చదవండి :