న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు అందరూ రెడీ అవుతున్నారు. న్యూఇయర్ వేడుకల కోసం వందలాది ఈవెంట్లు ప్లాన్ చేశారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఘనంగా పార్టీలకు సర్వం సిద్దమైంది. మరోవైపు పోలీసులు రెడీ అయ్యారు. కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రూల్స్ బ్రేక్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మెచ్చరిస్తున్నారు. డీజేలు వాడకూడదని, మ్యూజికల్ ఈవెంట్స్ అయితే ఇండోర్‌లో మాత్రమే జరుపుకోవాలని సూచిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని హైదరాబాద్ నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రికి మూసివేస్తున్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్, బార్లు, పబ్బుల టైమింగ్స్ ను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంచవచ్చని తెలిపింది.
మరో వైపు రాత్రి 8 గంటల నుంచే డ్రంకన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. డ్రంకన్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే 10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే 15 వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇక డ్రగ్స్ సేవించి పట్టుబడినోళ్లపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.