తెలంగాణ

రాజాసింగ్ అవుట్.. గోషామహాల్ బీజేపీ ఇంచార్జ్ గా మాధవీలత!

అధ్యక్ష పదవి ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపింది. రామచంద్రరావు ఎన్నికపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో కలకలం రేపారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కమలం పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టేది లేదని తేల్చిచెప్పారు. తన శాసనసభత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు లేఖ రాయాలన కిషన్ రెడ్డికి సూచించారు రాజాసింగ్.

రాజాసింగ్ ఎపిసోడ్ బీజేపీలో కాక రేపింది. అయితే ఆయన రాజీనామాను బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహాల్ నియోజకవర్గంపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాజాసింగ్‌కు ప్రత్యామ్నయ నేతను సిద్ధం చేశారని తెలుస్తోంది. పాతబస్తీలో రాజాసింగ్‌ను బలంగా ఢీకొట్టి.. ఓవైసీ బ్రదర్స్‌కు కూడా చుక్కలు చూపించే నేతను రంగంలోకి దించబోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాధవీలతకు బీజేపీలో ఫైర్‌ బ్రాండ్ లీడర్‌ గా పేరుంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని,ఎంఐఎం పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు మాధవీలత. ఎన్నికల ప్రచారం సమయంలో మాధవీలత ఫైర్ చూసిన కమలం పార్టీ లీడర్లు.. మాధవీలత పాతబస్తీకి కరెక్ట్‌ లీడర్‌గా భావించారు. భవిష్యత్తులో ఓవైసీని బలంగా ఢీకొట్టాలంటే.. మాధవీలత తోనే సాధ్యమని భావించారు. అయితే ఇప్పుడు మాధవీలతకు కమలం పార్టీ పెద్దలు మరో టాస్క్‌ అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో గోషామహాల్‌లో మాధవీలతకు గోషామహాల్ ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీజేపీ ఉందని సమాచారం.

ఇందులో భాగంగానే మాధవీలతను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్‌ బన్సల్‌ పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ ఇంచార్జ్ సునీల్ బన్సల్‌ సమావేశం తర్వాత పాతబస్తీలో పర్యటించారు మాధవీలత. క్యాడర్‌లో ఉత్సాహాం నింపేలా రోజంతా తిరిగారు. దీంతో సునీల్ బన్సల్‌ ఆదేశాలతోనే మాధవీలత ఓల్డ్‌సిటీలో పర్యటించారని చర్చ సాగుతోంది. రాజాసింగ్‌కు ప్రత్యామ్నాయంగా మాధవీలత ఉన్నారనే సిగ్నల్స్‌ పార్టీకి కేడర్కు పంపిచారనే టాక్ నడుస్తోంది.గోషామహాల్ బీజేపీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని అనుకుంటోందట.అందుకే మాధవీలతను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.మాధవీలతకు బలమైన వాయిస్‌, మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో తమకు కలిసివస్తుందని.. రాజాసింగ్ పోయినా తమకు ఇబ్బంది లేదని కమలం నేతలు లెక్కలు వేసుకుంటున్నారని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button