తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికొచ్చారు.ఆడబిడ్డల కోసం సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత బయటికి రాలేదు కేసీఆర్. ఎర్రవల్లి ఫాంహౌజ్ లోనే ఉంటున్నారు. వరదలతో ఖమ్మం అతలాకుతలమైన కేసీఆర్ స్పందించలేదు. గత రెండు నెలలుగా హైడ్రా పేరుతో రాద్ధాంతం నడుస్తున్నా కేసీఆర్ రియాక్ట్ కాలేదు. కేటీఆర్, హరీష్ రావులే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున జనంలోకి వెళుతున్నారు. మరోవైపు హైడ్రా బాధితులు కేసీఆర్ ఎక్కడున్నావ్ అంటూ రోధిస్తున్నారు. మాకోసం రావాలంటూ వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 4 నెలల తర్వాత రంగంలోకి దిగారు కేసీఆర్.
బతుకమ్మ పండుగ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ అన్నారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు.తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ గారు తెలిపారు.
ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దుల తో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా పల్లెలు పట్టణాలు బేధం లేకుండా మహిళలతో పిల్లా పాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు.బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రాశస్త్యాన్ని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కానుకలను అందజేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను ఆటా పాటలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ కోరారు.రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని ప్రార్థించారు.