తెలంగాణ అసెంబ్లీ తొలి రోజే రచ్చరచ్చైంది. ప్రశ్నోత్తరాల తర్వాత లగచెర్ల ఘటనపై చర్చించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టుబట్టింది. స్పీకరి అనుమతి ఇవ్వకుండా టూరిజంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. దీంతో గట్టిగా కేకలు వేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. సభలో గందరగోళం తలెత్తడంతో రేపటికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్.
అసెంబ్లీ వాయిదా తర్వాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుండి పోల్చుకుంటే స్థాంప్స్ &రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగిందని చెప్పారు. గత మూడు నెలల నుండి రియల్ ఎస్టేట్ పెరిగిందన్నారు. ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక తెలంగాణ రియల్ ఎస్టేట్ పై కొంత అభద్రత భావం ఉండేదని.. ఇటీవల వచ్చిన ప్లడ్ ఎఫెక్ట్ తో అది తొలగిపోయిందని పొంగులేటి అన్నారు. వరదల్లో మునిగిపోయే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకురారనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. అమరావతికి వెళ్లాలనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు తెలంగాణ బాట పట్టారని పొంగులేటి చెప్పారు.
స్పీకర్ కు భట్టి విక్రమార్కపై ప్రైవిలేజ్ మోషన్ ఇవ్వడం అర్ధరహితమన్నారు మంత్రి పొంగులేటి. కార్పొరేషన్ లు ఒక్క రూపాయి కూడా స్వంతంగా జనరేట్ చేసుకునే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవమన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ చూస్తుందన్నారు పొంగులేటి. చర్చ నుండి తప్పించుకునేందుకే అనవసర లొల్లి చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటదన్నారు.
సన్న వడ్లకు బోనస్ వచ్చే పంటకు కూడా ఇస్తామని పొంగులేటి ప్రకటించారు. కొంతమంది ఆంధ్ర నుండి బోనస్ కోసం తెలంగాణలో వడ్లు అమ్మే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నామని తెలిపారు. ఇండస్ట్రీ పాలసీలో పెట్టుబడులు ఎవరన్నది ముఖ్యం కాదు…పెట్టుబడులు ఎవరు పెట్టినా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం జరగాలని అన్నారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. తమకు సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలు అందరు సమానమేనని పొంగులేటి తెలిపారు. భూమి లేని నిరుపేదలకు 12000 రూపాయలు ఇస్తామన్నారు. సుమారు 15 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. సంక్రాతి కి రైతు భరోసా ఇస్తామని.. ఆసరా పెన్షన్ల విడుదలకు యత్నిస్తున్నామని పొంగులేటి వెల్లడించారు.