తెలంగాణ

మీర్ పేట చెరువుకు హైడ్రా బుల్డోజర్లు!సబితమ్మ ఇలాఖాలో కూల్చివేతలు..

హైదరాబాద్ లో రూల్స్ కు విరుద్దంగా చెరువులు కబ్జా చేసిన నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతోంది. అక్రమ నిర్మాణాలపై ఎక్కడ ఫిర్యాదు వచ్చినా.. అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చెరువులు, ప్రభుత్వ స్థలాలు పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన కూల్చివేతలపై నిర్ణయం తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకుని ఉండటంతో.. అలాంటి ఏరియాల్లో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న డైరెక్షన్ ప్రకారం యాక్షన్ లోకి బుల్డోజర్లను దింపుతున్నారు హైడ్రా కమిషనర్.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి హైడ్రాకు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. మీర్ పేట, బడంగ్ పేట కార్పొరేషన్ల పరిధిలో పదుల సంఖ్యలో చెరువులు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానికుల నుంచి వచ్చన ఫిర్యాదులతో
మీర్ పేట పెద్ద చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.

మీర్​ పేట కార్పొరేషన్ పరిధిలోని చెరువులు, రాంనగర్​ మణెమ్మ వీధిని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు. పెద్ద చెరువు, చంద చెరువు, మంత్రాల చెరువులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు గొలుసుకట్టు చెరువులపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. చెరువు, ఎఫ్​టీఎల్, బఫర్ జోన్​ల హద్దులు ఎక్కడున్నాయో పరిశీలించారు. కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎన్ని కబ్జాలు గుర్తించారు? అందులో ఎన్ని కూల్చారు? అని అధికారులను ప్రశ్నించారు. మూడు చెరువులు ఎంత మేర కబ్జాకు గురయ్యాయి?.. ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? అనే విషయాలపై మంగళవారం వరకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.

కబ్జాకు గురైన ప్రాంతాలను గుర్తించి కూల్చేయాలని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రోడ్లపై అక్రమంగా షెడ్లు నిర్మిస్తే వెంటనే తొలగించాలన్నారు. ఇండ్లకు సంబంధించిన దస్తావేజులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

Back to top button