క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో హైడ్రా చేపట్టిన చర్యలపై భిన్న వాదనలు వస్తున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతలను మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండగా.. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల క్రితం కట్టిన కట్టడాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక అక్రమ కట్టడాలంటూ హైడ్రా నోటీసులు ఇస్తుండగా.. నోటీసులు అందుకు జనాలు మాత్రం భగ్గుమంటున్నారు. అన్ని అనుమతులు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే.. ఇప్పుడొచ్చి అక్రమమమని ఎలా నోటీస్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రెవిన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై సీరియస్ గా స్పందించారు దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు.
అమర్ సొసైటీకి 1991లో అప్రూవల్ లే ఔట్ తీసుకొన్నామని చెప్పారు. అమర్ సొసైటీ లో 140 ఫ్లాట్స్ ఉన్నాయని.. GHMC అధికారుల నుంచి అన్ని అనుమతులను తీసుకోన్నామన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని ఇల్లులు నిర్మించుకున్నామని తెలిపారు.2020లో హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు దర్యాప్తు చేసి మా ఫ్లాట్స్ FTL పరిధిలోకి రావని అధికారులు వెల్లడించారని అమర్ సొసైటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వాలు మారితే ఆధారాలు అలాగే ఉన్నాయన్నారు.
1991లో FTL,బఫర్ జోన్ అంశం లేదన్నారు. అప్పట్లో దుర్గం చెరువు ఎంత ఉంది.. ఇప్పుడు ఎంత ఉంది అన్ని వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. 30 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని.. కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న తాము ఎక్కడికి పోతామని నిలదీశారు.ఇప్పుడు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఎలా చెబుతారన్నారు. వాల్టా చట్టం రాక ముందే అన్ని అనుమతులు తీసుకున్నామని.. తమ ఇండ్లు కూల్చివేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు.