హైదరాబాద్ లో ఓ వైపు వినాయకచవితి వేడుకలు వైభవంగా సాగుతుండగా.. మరోవైపు హైడ్రా కూల్చివేతలు అదే రేంజ్ లో సాగుతున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన అత్యాధునిక బుల్దోజర్లతో పెద్దపెద్ద భవనాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. పెద్ద పెద్ద బిల్డింగులు క్షణాల్లో కుప్పకూలిపోతున్నాయి.
మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. సున్నం చెరువును చెరపట్టిన కబ్జాదారుల భరతం పట్టింది హైడ్రా. సున్నం చెరువులో ఉదయం హైడ్రా అధికారులు భారీ బంధోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు.మాదాపూర్ సున్నం చెరువులో 2023లో చేసిన సర్వే ప్రకారం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. ఫుల్ ట్యాంక్ లెవల్(FTL) పరిధి 15 ఎకరాల 23 గుంటలు. చెరువు FTL, బఫర్ జోన్ లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్లు నిర్మించారు. కొన్ని భవనాలు కట్టారు. సర్వే నంబర్లు 12,13,14,16 ల్లో ఉన్న ఎత్తైన కట్టడాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు.
సున్నం చెరువులో పదుల సంఖ్యలో వాటర్ ఫిల్టర్ బిజినెస్ సాగుతోంది. అదే సమయంలో అక్రమ కట్టడాలు వెలిశాయి. హైడ్రా కూల్చివేతలు సాగిస్తున్నా కొందరు సున్నం చెరువులో నిర్మాణాలు చేపట్టారు. ఇటీవలే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సున్నం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు కబ్జాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు.. సున్నం చెరువు LFT,బఫర్ జోన్లలో చేపట్టిన అక్రమ కట్టడాలను గుర్తించి యాక్షన్ లోకి దిగారు. బుల్దోజర్లను దింపారు. సున్నం చెరువులో కట్టిన అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. గాయత్రినగర్ ప్రాంతంలోనూ అక్రమ కట్టడాలు ఉన్నాయని.. వాటిని కూడా కూల్చాలని కొందరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బడా నేతల భవంతులు ఉన్నాయని.. వాటిని కూడా నేలమట్టం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.