తెలంగాణ

బుల్డోజర్ ఎఫెక్ట్.. తెలంగాణ జీఎస్టీ వసూళ్లు ఢమాల్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్లు రాష్ట్ర సర్కార్ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వసూళ్లలో భారీ పతనం నమోదైంది. తెలంగాణలో 2023 సెప్టెంబర్‌లో 33% జీఎస్టీ వృద్ధి రేటు ఉంటే.. 2024 సెప్టెంబర్‌లో అది 0.78%కు పడిపోయింది. 2022 సెప్టెంబర్ లో జీఎస్టీ వసూళ్లు 3915 కోట్లు రూపాయలు కాగా.. 2023 సెప్టెంబర్ లో ఏకంగా 5226 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే ఆ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 33 శాతం హైక్ కనిపించింది.

ఇక 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు కేవలం 5267 కోట్ల రూపాయలు. అంటే 2023తో పోల్చితే కేవలం 0.78 శాతమే హైక్. ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 15 శాతం వృద్ది ఉంటుందని బడ్జెట్ లో ప్రభుత్వం అంచనా వేసింది. కాని హైడ్రా దెబ్బకు అంతా తలకిందులైంది. బుల్డోజర్ కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. దాని ప్రభావం ఇతర రంగాలపైనా పడింది. ఇదే జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపించిందని అంటున్నారు. మార్కెట్లో గుండు సూది నుండి రియల్ ఎస్టేట్ దాకా అన్ని రకాల వస్తువులు, సేవల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా మందగించాయనడానికి ఇదొక ఉదాహరణ.

జీఎస్టీ వసూళ్లు తగ్గడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్‌ సంస్కృతిని తీసుకురావటంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయ్ అని ట్వీట్ చేశారు. గతేడాది తో పోల్చుకుంటే తొలిసారిగా తెలంగాణ లో జీఎస్టీ వసూళ్లు 1 శాతం కంటే తక్కువకు పడిపోయాయి. GST వసూళ్లలో తెలంగాణ ఎప్పుడు కనీసం 15 శాతం వృద్ధిని సాధించేదని.. తెలంగాణ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో విజయవంతంగా పోటీపడుతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానంలో నిలిచి అనూహ్యమైన ఘనతను సాధించిందని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో ఆబ్కారీ శాఖ మాత్రమే మంచి పనితీరు కనబరుస్తూ గొప్పగా ఫలితాలనిస్తోందని చెప్పారు. తెలంగాణ వంటి సంపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక ప్రతిభ అవసరం అంటూ సెటైర్లు వేశారు. ఈ తిరోగమన పరిస్థితి పై సీఎం సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని కేటీఆర్ పోస్ట్ చేశారు.

Back to top button