అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు తీన్మార్ మల్లన్న. రేవంత్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. కొంత కాలంగా బీసీ గళం వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న.. తాజాగా EWS రిజర్వేషన్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. EWS రిజర్వేషన్లతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో EWS రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. EWS రిజర్వేషన్ల కోటా ఫిక్స్ చేయకుండా 10 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం అమలు చేసిందన్నారు. EWS రిజర్వేషన్ల అమలు వల్ల DSCలో వంద మందికి రావాల్సిన ఉద్యోగాలు 11 వందలకు వస్తున్నాయని తెలిపారు. 5 శాతం లేని EWS వాళ్లకు 10 శాతం కోటా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. EWS రిజర్వేషన్ల అమలు పై సిఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు తీన్మార్ మల్లన్న.
కేంద్రంలోని బీజేపీ తెచ్చిన ఈడబ్యూఎస్ కోటాను తమిళనాడు లాంటి రాష్ట్రాలు అమలు చేయడం లేదన్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ కూడా తమిళనాడు తీసుకున్న నిర్ణయాన్ని తీసుకోవాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందిచకపోతే బీసీలందరిని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.