తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించారు.
ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై FIT KK Park (Foxconn Interconnect Technology Kongara Kalan Park) కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూ (Young Liu) గారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు.
కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు Foxconn ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.