తెలంగాణ

నేను మొండిదాన్ని..కేసీఆర్ బిడ్డ‌ను..కవిత భావోద్వేగం

కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటికి వచ్చారు. 165 రోజుల జైలు జీవితం తర్వాత ఢిల్లీ తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే కవిత భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో బయటికి వచ్చిన కవిత.. జైలు గేటు దగ్గర నిలబడిన తన కొడుకును పట్టుకుని ముద్దాడారు. తనివితీరా ఆలింగం చేసుకున్నారు. కొడుకు పక్కనే ఉన్న భర్త అనిల్ ను ఆలింగనం చేసుకున్నారు. ఆ పక్కనే ఉన్న అన్న కేటీఆర్ ను పట్టుకుని ఏడ్చారు. హరీష్ రావు చేయి పట్టుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

పిడికిలెత్తి జైలు నుంచి బయటికి వచ్చిన కవిత.. మీడియాతో మాట్లాడారు. నేను మొండిదాన్ని…కేసీఆర్ బిడ్డ‌ను అన్నారు. పోరాటం ఆపేది లేదన్నారు. 18 యేళ్లు నేను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని చెప్పారు. ఒక తల్లిగా అయిదున్నరనెలలు కుటుంబాన్ని వదిలి ఉండటం అంటే బాధగానే ఉందన్నారు.

ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అన్న కవిత.. అన్ని గుర్తు పెట్టుకుంటాను.. తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తానని తెలిపారు. ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను కేసిఆర్ బిడ్డను..నేను భయపడను,తప్పు చేయనని కవిత తేల్చి చెప్పారు. అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. ఇంకా తెగింపు ఉంది.. అంతే ధైర్యంతో ప్రజా క్షేత్రంలో నిలబడుతా.. అంతే పొరాడుతా అంటూ కళ్లలో వస్తున్న నీళ్లను తూడుచుకుంటూ భావోద్వేగంగా మాట్లాడారు కవిత.

Back to top button