వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐదుగురు మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీశారు. వరదలో చిక్కుకుని ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లలో రెండు రోజులు ఉన్నా ఒక్క అధికారి కూడా తమ దగ్గరికి రాలేదని ఆరోపించారు.
మున్నేరు వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. వరద బాధితులకు తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. రేవంత్ ఈ ప్రకటన చేయగానే అక్కడే ఉన్న బాధితులు మండిపడ్డారు. మీరు ఇచ్చే పది వేలు ఎవడికి కావాలంటూ నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే ప్రశ్నించారు మహిళలు. మా ప్రాణాలు పోతే ఏం చేసేవారని నిలదీశారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించడంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి ఆ మహిళలను తరలించారు.
సీఎం రేవంత్ రెడ్డి రాకకు ముందు కూడా మున్నేరు వాగు విలయానికి గురైన ప్రకాష్ నగర్ లో నిరసనలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇంత చేతకాని ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. దీంతో నిరసనకారులను పోలీసులు తరిమేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే సమయంలో ఆందోళన చేస్తారనే అనుమానం ఉన్న యువకులను అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల పర్యటన సాగింది.