తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయాయి. ఖమ్మం సహా పలు ప్రాంతాల్లో జల విలయం కనిపించింది. ఏపీలో విజయవాడ పూర్తిగా నీట మునిగింది. కాని కుండపోతగా వర్షం కురిసినా హైదరాబాద్ మాత్రం సేఫ్ గా ఉంది. హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురిస్తున్నా వరద ప్రభావం లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ ఘనత వల్లే ఇది సాధ్యమైందంటూ కేటీఆర్ ఎక్స్ తెలిపారు.
‘భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదని వినడానికి చాలా ఆనందంగా ఉంది. నాలా అభివృద్ధి కార్యక్రమం హైదరాబాద్‌లో క్రమబద్ధమైన పునర్వ్యవస్థీకరణ, జవాబుదారీతనంతో స్పష్టమైన ఉద్దేశంతో పరిణాత్మక మార్పును తీసుకొచ్చింది. హైదరాబాద్ కోసం బీఆర్‌ఎస్ పార్టీ దార్శనికతకు జీవం పోయడానికి మా అసాధారణమైన ఇంజనీర్ల బృందం, అన్ని విభాగాలు కలిసికట్టుగా పని చేశారు. వారి సహకారం.. ఏ కృషి లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు’ అని కేటీఆర్ తెలిపారు.
‘మీ అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత బలంగా, మెరుగ్గా ఉంది. నాతో పాటు నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని నాడు తాను మంత్రిగా పని చేసిన సమయంలో సహకరించిన జీహెచ్‌ఎంసీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన నాలాల అభివృద్ధితో హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.