తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజులు పాటు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో నేడు సాయంత్రం మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
తెలంగాణలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. నవంబర్ 7 నుంచి 11 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు చాన్స్ ఉన్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆశించిన దానికంటే అధిక వర్షాలు నమోదైనట్లు వాతారవణశాఖ అధికారులు తెలిపారు.
ఇక గతకొన్ని రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన వారం రోజులుగా చలిగాలులు పెరిగాయి. అనేక ప్రాంతాల్లో 18 డిగ్రీల లోపుగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో బుధవారం 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలలో 14.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.
పగలు ఎండలు బాగానే ఉంటున్నప్పటికీ సాయంత్రం తరువాత చలిగాలులు మొదలవుతున్నాయి. పగలు కొన్ని జిల్లాల్లో 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. రాత్రి సమయాల్లో 18 డిగ్రీల దిగువకు పడిపోతున్నాయి. సీజన్ ఆరంభంలోనే చలి వణికిస్తుండడంతో ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.