హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ, ఏపీలో ఎక్కడ చూసినా నాగార్జున భవనం కూల్చివేత గురించే చర్చ. అక్రమ కట్టడాలపై పంజా విసురుతున్న హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా తన విశ్వరూపం చూపించింది. 2015 నుంచి N కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మడిగుంట చెరువును రక్షించింది.
అక్రమ కట్టడాన్ని కూల్చేసిన హైడ్రా అధికారులకు జనాల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ తరహాలోనే చెరువు భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో.. ఆ నిర్మాణంపైనా రకరకాల చర్చలు సాగుతున్నాయి. హీరో నాగార్జున ఆ కట్టడాన్ని ఎప్పుడు కట్టారు.. ఎన్ని ఎకరాల్లో కట్టారు.. అందులో చెరువు భూమి ఎంత.. ఆ నిర్మాణానికి ఎవరూ అనుమతి ఇచ్చారు.. ఇప్పుడెందుకు కూల్చేశారు.. ఈ అంశాలే ఆసక్తిగా మారాయి.
హైదరాబాద్ సైబర్ టవర్స్ ఎదురుగానే ఉంది నాగార్జున N కన్వెన్షన్ సెంటర్. హైటెక్ సిటీ జంక్షన్‌లో వేల కోట్ల విలువైన 10 ఎకరాల విస్తర్ణంలో దీన్ని నిర్మించారు. 2015లో హీరో నాగార్జున N కన్వెన్షన్ నిర్మించారు. అప్పటి నుంచి ఈ కట్టడంపై వివాదం నడుస్తుంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో వందలు, వేల కోట్ల డబ్బున్నోళ్ల ఫంక్షన్స్ జరుగుతుంటాయి. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు అడ్డాగా మారిన..
ఈ N కన్వెన్షన్ సెంటర్ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉంది.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన 10 ఎకరాల్లో తుమ్మటికుంట చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో ఒక ఎకరా 12 సెంట్లు చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ FTLలో ఉండగా… మరో రెండు ఎకరాలు బఫర్ జోన్ లో ఉంది. తుమ్మిడికుంట చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు. ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది 3.5 ఎకరాలు. తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి.
తుమ్మడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే N కన్వెన్షన్ కట్టారు.. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి.. ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూలగొట్టింది. కూల్చివేతల తర్వాత N కన్వెన్షన్ పరిధి కేవలం 6.5 ఎకరాలకు పరిమితమైంది.