తెలంగాణ

నల్గొండ కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు.. ఎమ్మెల్యేలు మాకొద్దంటూ నేతల ధర్నాలు

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ తీరే వేరు. అధికారం ఉన్నా.. లేకపోయినా నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మాత్రం ఆగదు. గతంలో ఒకరికి ఒకరు ఓడించుకున్న సందర్భాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నేతలంతా కలిసిపోయారు. కలిసికట్టుగా ప్రచారం చేశారు. అందుకే జిల్లాలోని 12 సీట్లకు గాను 11 సీట్లను బంపర్ మెజార్టీ హస్తగతం చేసుకుంది హస్తం పార్టీ. ఓడిపోయిన ఒక్క సూర్యాపేటలోనూ కేవలం 5 వేల ఓట్లతోనే. కాని అధికారంలోకి వచ్చిన వెంటనే సీన్ మారిపోయింది. నేతలంతా మళ్లీ ఎవరికి వారే అయ్యారు. తమ వర్గాన్ని పొంచి పోషించుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రెండు, మూడు వర్గాలు తయ్యారయ్యాయి. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నాయి.ఎమ్మెల్యే మాకొద్దంటూ కాంగ్రెస్ నేతలే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే వర్గ పోరు ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో‌ వర్గ పోరు రోడ్డున పడింది. ఎమ్మెల్ మందుల సామేలు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య పట్టగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా ఏకంగా అసమ్మతి సమావేశం పెట్టారు డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో దగాపడ్డా కాంగ్రెస్ నాయకుల్లారా కదలిరండి పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ మీటింగ్ పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి రాకుండా మాజీ మంత్రి అనుచరులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో వాళ్లంతా నూతనకల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల విరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. ఎమ్మెల్యేకు తెలియకుండానే మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో మంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వేముల వర్గం ఆరోపిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి సొంతూరు ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో ఆయన ఎమ్మెల్యేను కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల మంత్రుల పర్యటనలో వేములను పోలీసులు అడ్డుకోవడం వెనుక మంత్రి హస్తం ఉందని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. అటు వీరేశం కూడా కోమటిరెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. గతంలోనూ వీరేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పెద్ద ఎత్తున వార్ నడిచింది.

సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అండతో రమేష్ రెడ్డి రెచ్చిపోతున్నారని దామోదర్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. సూర్యాపేటలో రాంరెడ్డికి అడ్డు వస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి.. జిల్లా మంత్రులకు పొసగడం లేదని అంటున్నారు. లక్ష్మారెడ్డి మంత్రి పొంగులేటి డైరెక్షన్ లో పని చేస్తున్నారనే భావనలో కోమటిరెడ్డి ఉన్నారని అంటున్నారు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి టార్గెట్ చేశారనే టాక్ వస్తోంది. గతంలో కోమటిరెడ్డితో విభేదాల వల్లే అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికలకు ముందు మళ్లీ సొంత గూటికి వచ్చారు. అయితే అనిల్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు ఉందని చెబుతున్నారు.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మొదటి నుంచి మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. కాని ఇప్పుడు సీన్ మారిందంటున్నారు. బీర్ల అయిలయ్య మంత్రిపదవి రేసులో ఉండగా.. ఆ పదవికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ విషయంలోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ తో బీర్లకు గ్యాప్ వచ్చిందంటున్నారు. బీర్ల అయిలయ్య పూర్తిగా సీఎం రేవంత్ టీంలోకి వెళ్లిపోయారంటున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కు పోటీగా మరో నేతను గుత్తా సుఖేందర్ రెడ్డి, జానా రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారనే టాక్ నియోజకవర్గంలో సాగుతోంది. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సొంత నియోజకవర్గం నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి చెక్ పెడుతున్నారని అంటున్నారు. గుత్తా వెనుక సీఎం రేవంత్ ఉన్నారని చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పోటీగా చలమల కృష్ణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ప్రోత్సహిస్తుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button