తెలంగాణలో సమగ్ర కుటుంబ కులగణన సర్వే ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర సర్వేలో భాగంగా హైదరాబాద్ లో ఓ ఇంటికి వెళ్లి సర్ ఫ్రైజ్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మహ్మద్ నయీం కుటుంబ సభ్యుల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ నమోదు చేశారు.బంజారాహిల్స్‌లోని ఎన్‌క్లేవ్ అపార్ట్మెంట్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మితో కలిసి మంత్రి సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి వివరాలు నమోదు చేశారు.
ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. సర్వే విషయంలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఎక్కడా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు.. ఇంకా పథకాలు అమలవుతాయి.. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఈ సర్వే దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం సర్వే పూర్తైందని చెప్పారు.