ఫైర్ బ్రాండ్ లీడర్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఏఐసీసీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి సొంత నేతలపై ఫైర్ అయ్యారు.ఏఐసీసీ కార్యదర్శి విష్ణు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీలో సీనియర్లను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని.. ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసిన వారిని ఎవరు పట్టించుకోవాలని అడిగారు. అసలు విష్ణు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానన్న విష్ణు ఎక్కడికి వెళ్లారని అడిగారు.
ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కూడా తెలంగాణ రాష్ట్రానికే పనిచేస్తున్నారా? లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా? అని జగ్గారెడ్డి నిలదీశారు. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి.. అసలు మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.జగ్గారెడ్డి కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.