కుండపోత వర్షాలతో తెలంగాణ ఆగమాగమైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో వరద బీభత్సం స్పష్టించింది. మున్నేరు వాగు ఉప్పొంగడంతో ఖమ్మం సగం పట్టణం జలమలమైంది. మహబూబా బాద్, ములుగు, కొత్తగూడెం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. భారీగా రోడ్లు, కల్వర్టులు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లాలోనూ అపార నష్టం జరిగింది. వర్షాలు, వరదలతో 5 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్యీ తీన్మార్ మల్లన్న ఇతర నాయకులకు ఆదర్శంగా నిలిచారు. వరద బాధితులకు సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల 75 వేల రూపాయల చెక్ పంపించారు తీన్మార్ మల్లన్న. వరద బాధితులకు అండగా నిలిచేందుకు అంతా ముందుకు రావాలని పిలుపిచ్చారు. వేల కోట్ల సంపాదించిన రాజకీయ నేతలు, వ్యాపారులు ఇంతవరకు వరద సాయం ప్రకటించలేదు. కాని కేవలం రెండు నెలల క్రితమే ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న అందరి కంటే ముందే వరద సాయం ప్రకటించడంతో ఆయనపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. అంతేకాదు తన మల్లన్న టీం సభ్యులను వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపిచ్చారు తీన్మార్ మల్లన్న.