తెలంగాణ

ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. కొండాకు చెక్ పెట్టిన సీఎం రేవంత్!

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మరింత ముదిరింది. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమయ్యారు జిల్లా కాంగ్రెస్ నేతలు. కొండా సురేఖను వ్యతిరేకిస్తున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళుతున్నారు. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ ను కలిసి కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్నారు. వరంగల్ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. కొండా సురేఖ వర్గీయులు అన్ని విషయాల్లో తమను ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కొండా సురేఖ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని హైకమాండ్ కు చెప్పనున్నారు.

రెండు రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి వరంగల్ కాంగ్రెస్ నేతలు కొండా సురేఖపై ఫిర్యాదు చేశారు.హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బుధవారం ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిశారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొండా సురేఖతో తమకున్న సమస్యలు చెప్పుకున్నారు.కొండాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ఆమెపై యాక్షన్ తీసుకోవాలని కోరారని తెలుస్తోంది. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఢిల్లీ టూర్ తో కొండా సురేఖకు చెక్ పడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.

ఇటీవలే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కొండా సురేఖకు రచ్చ జరిగింది. గీసుకొండ మండల కేంద్రంలో కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో పెట్టలేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చేశారు. కొండా వర్గీయులను నిలదీశారు. ఈ గొడవలో కొండా వర్గీయులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీంతో తమ మనుషులను కలిసేందుకు గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చారు మంత్రి కొండా సురేఖ. సీఐ కుర్చిలో కూర్చుని ఎమ్మెల్యే రేవూరికి వార్నింగ్ ఇచ్చారు. తమ అనుచరులను వేధిస్తే ఊరుకునేది లేదని చెప్పారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తమను టార్గెట్ చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని కొండా దంపతులు భావిస్తున్నారని తెలుస్తోంది. రేవూరి గతంలో టీడీపీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేశారు. వరంగల్ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రేవూరి అత్యంత సన్నిహితుడు. దీంతో రేవూరికి ముఖ్యనేతల మద్దతు ఉందని.. అందుకే తమను లెక్క చేయకుండా ఉన్నారనే భావనలో కొండా ఉన్నారంటున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం.. కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ ఇవ్వడం వెనుక కూడా ముఖ్యనేతల డైరెక్షన్ లోనే జరిగిందనే టాక్ వస్తోంది. కొండాకు చెక్ పెట్టడానికే అలా హస్తిన మీదుగా ప్లాన్ చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button