తెలంగాణ

డీఎస్సీ టీచర్లకు షాక్.. పోస్టింగులు వాయిదా!

డీఎస్సీ 2024లో ఎంపికైన టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందుకున్న టీచర్లకు ఇవాళ పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. డీఎస్సీ లో సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క కౌన్సిలింగ్ అన్ని జిల్లాల డాటా రానందున వాయిదా వేయడం జరిగిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో పోస్టింగుల కోసం వచ్చిన టీచర్లు పరేషాన్ అవుతున్నారు. చివరి నిమిషంలో వాయిదా వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఎస్సీ వర్గీకరణ చేయకుండానే డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారని మాదిగలు ఆరోపిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని బీసీ నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సడెన్ గా పోస్టింగుల కౌన్సిలింగ్ వాయిదా వేయడం సంచలనంగా మారింది.

డీఎస్పీ పోస్టింగులు జిల్లాల వారీగా జరుగుతాయని.. అన్ని జిల్లాల డేటా అవసరం లేదని కొందరు చెబుతున్నారు. డేటా ఉన్న జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చి… లేని జిల్లాల్లో వచ్చిన తర్వాత చేయవచ్చని.. అలా కాకుండా రాష్ట్రం మొత్తం ఆపాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గందరగోళంలో పడాల్సిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button