ఖమ్మంలో మున్నేరు వరద బాధితులను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. వరద బాధితులకు భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. వరద బాధితులకు తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయిందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం రేవంత్ అన్నారు. వరదలతో 16 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చానని.. ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించామన్నారు రేవంత్.
బేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాయం కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వర్షాల వల్ల రాష్ట్రంలో రూ. 5438 కోట్ల నష్టం జరిగిందని రేవంత్ తెలిపారు.తెలంగాణలో పర్యటించాలని ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు.
పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గరకు వెళ్తున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారన్నారు.కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదంటు విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదన్నారు. ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదన్నారు.కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న లక్షల కోట్ల సొమ్ములో .. వెయ్యి కోట్లో , రెండు వేల కోట రూపాయలే బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.