తెలంగాణ

చెరువు FTLలో 23 అంతస్తుల బిల్లింగ్.. హైడ్రా కూల్చేస్తుందా?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల లెక్క తేల్చే పనిలో పడింది హైడ్రా. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువులు, నాలాలు పరిశీలిస్తూ అక్రమ కట్టడాలను గుర్తిస్తోంది. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం దుండిగల్, బాచుపల్లి మండలాల్లో హైడ్రా అధికారులు సర్వే చేశారు.

సర్వే నంబర్ 181లోని జిన్నారం అడవుల నుంచి కత్వ చెరువులోకి వచ్చే ప్రధాన నాలాలను పలువురు ఆక్రమించి బిల్డింగ్స్​ నిర్మించారు. దీంతో వర్షం నీరు చెరువులోకి వెళ్లడం లేదు. ఇరిగేషన్​ అధికారులు  ప్రత్యామ్నాయంగా మరో నాలాలను తవ్వి వర్షపు నీటిని చెరువులోకి మళ్లించారు. అయితే  అర్ధరాత్రి తర్వాత కొందరు ఆక్రమణదారులు ఆ నాలాను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్, హైడ్రా అధికారులు తిరిగి నాలాను పునరుద్ధరించారు. జిన్నారం, దుండిగల్​ అధికారులతో జాయింట్​ సర్వే చేయిస్తున్నారు హైడ్రా అధికారులు. కత్వ చెరువును ఆక్రమించి కట్టిన లక్ష్మీ శ్రీనివాస ​ విల్లాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. కొన్ని విల్లాలు ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ లో కట్టినట్లు నిర్ధారించారు.

సర్వేనెంబర్​ 166 బౌరంపేట నుంచి వచ్చే నేరెళ్ల వాగులో అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. బాచుపల్లిలోని వాసవి కట్టడాలను హైడ్రా శీలించింది. ఇందులోని 8, 9 బ్లాకులు కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించినట్లు తేల్చారు. 8వ బ్లాక్ ​పుట్టింగ్ ​స్టేజీలో ఉండగా, 9వ బ్లాక్​ 23 ఫ్లోర్లు నిర్మించారు. ఎల్లమ్మకుంట చెరువు మత్తడి ఆక్రమణకు గురైనట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన 23 అంతస్థుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేస్తారనే చర్చ సాగుతోంది. స్థానికులు అదే డిమాండ్ చేస్తున్నారు.

Back to top button