తెలంగాణ

ఖమ్మంలో హరీష్ రావు, జగదీశ్ రెడ్డిపై దాడి

ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వరద బాధితుల దగ్గరకు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. వరద బాధితులకు బీఆర్ఎస్ నేతలు ఆహార ప్యాకెట్లు అందిస్తుండగా అడ్డుకున్నారు. హరీష్ రావు, జగదీశ్ రెడ్డి వాహనాలపై దాడికి దిగారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో హరీష్ రావు కారు అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను తరిమేశారు. బీఆర్ఎస్ పంపిణి చేస్తున్న నిత్యావసరాలను ఆపడానికే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు.
ప్రజలకు సాయం చేయటం చేతగాక…సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని మండిపడ్డారు.

మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు…సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే…ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని చెప్పారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమన్నారు కేటీఆర్.

 

Back to top button