నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఏడాది కురవాల్సిన దాని కంటే భారీగా వర్షాలు కురిసినా పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందడం లేదు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని గ్రామాలకు నెలల తరబడి తాగునీరు రావడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మహిళలు రోడ్డెక్కారు. నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో నిరసనకు దిగారు మహిళలు. నల్లగొండ మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ల బావుల దగ్గర నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులకు, స్థానిక నేతలకు చెప్పినా ఎవరూ స్పందించకపోవడంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. మహిళల ఆందోళనతో నల్గొండ కనగల్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామైంది.
ప్రభుత్వానికి, మంత్రి కోమటరెడ్డికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. గత ఐదేళ్లలో తాగునీరు సమస్య ఎప్పుడు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నీళ్లు సమస్య వచ్చిందని మహిళలు చెప్పారు. మిషన్ భగీరథ అధికారులు సరిగా పని చేయడం లేదని.. ఎవరికి అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గుర్తు చేసుకున్నారు. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తే.. కాంగ్రెసోళ్లకు నీళ్లు సరఫరా చేయడం చేతకావడం లేదని మండిపడ్డారు.