క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను ఓడగొట్టేందుకు కుట్ర చేశారని బహిరంగంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని దగ్గరుండి తానే ఓడగొడ్తానని తీన్మార్ మల్లన్న శపథం చేశారు.
తన ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు కోమటిరెడ్డి విదేశాల నుండి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగారని మల్లన్న తెలిపారు. గుర్తుపెట్టుకోండి వీళ్లకు మిత్తి, అసలు, చక్రవడ్డీతో సహా చెల్లించి ఒక్కరిని కూడా గెల్వనియ్యను అని మల్లన్న స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ తో తీన్మార్ మల్లన్నకు మొదటి నుంచి మంచి సంబంధాలు లేవు. తన యూట్యూబ్ ఛానెల్లో కోమటిరెడ్డి సోదరులను ఏకిపారేసేవాడు మల్లన్న. కోమటిరెడ్డి బ్రదర్స్ తోనే నల్గొండ జిల్లా నాశనం అయిందని చెప్పేవారు. జిల్లాలో బీసీ నేతలను అణగదొక్కారని ఆరోపించారు. నల్గొండకు పట్టిన శని పోవాలంటే కోమటిరెడ్డి సోదరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని పిలుపు ఇచ్చేవారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరడంతో.. వాళ్లతో కలిసి పని చేయాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డితో కలిసి ప్రచారం కుడా చేశారు.
అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం తమ నైజం మార్చుకోలేదని.. బీసీ అయిన తనను టార్గెట్ చేశారన్నది మల్లన్న భావన. ఎన్నికల సమయంలో గెలవాలి కాబట్టి తనకు కొంత గౌరవం ఇచ్చారని.. మంత్రి పదవి రాగానే వెంకట్ రెడ్డి మళ్లీ తన రెడ్డి ఆహంకారం చూపించారని మల్లన్న ఆరోపిస్తున్నారు. తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు రాకుండా చివరి వరకు ప్రయత్నించారని చెబుతున్నారు. తాను పోటీలో ఉండటంతో.. సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూనే తన ఓటమికి కుట్రలు చేశారని మల్లన్న చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో దాదాపు 20 రోజుల పాటు రాజగోపాల్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మల్లన్నకు మద్దతుగా ఒక సమావేశం కూడా పెట్టలేదు. ఇక పోలింగ్ ఐదు రోజుల ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమెరికా జంప్ కొట్టారు.ఎన్నికల పోలింగ్ కు ముందు జిల్లా మంత్రి విదేశాలకు వెళ్లడం అప్పట్లోనే చర్చగా మారింది. మల్లన్న ఓడిపోవాలనే భావనతోనే కోమటిరెడ్డి యూఎస్ వెళ్లారనే టాక్ వచ్చింది.
తాజాగా కోమటిరడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న.. అమెరికా నుంచి కూడా తన ఓటమికి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్లాన్ చేశారని అంటున్నారు. అధికారులకు కూడా తనకు వ్యతిరేకంగా పని చేయాలని చెప్పారని చెబుతున్నారు. నల్గొండ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం మొత్తం తనకు వ్యతిరేకంగా పని చేసిందని తన అనుచరులతో బహిరంగంగానే చెబుతున్నారు తీన్మార్ మల్లన్న. బీసీ వర్గం అండతోనే తాను గెలిచానని అంటున్నారు. తీన్మార్ మల్లన్న చేసిన తాజా ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
Read More : సీఎం రేవంత్‌తో తేల్చుకుంటా.. తొడగొట్టిన హీరో నాగార్జున!