తెలంగాణ

కొడుకు తిండి పెట్టడం లేదంటూ ఆర్డీవో కాళ్లు మొక్కిన తల్లి

మానవత్వం మంటకలిసిపోతోంది. సొంత తల్లిదండ్రులను వేధిస్తున్నారు కొడుకులు. ఉన్న ఆస్తి మొత్తం లాగేసుకుని రోడ్డున పడేస్తున్నారు. తిండి కూజా పెట్టకుండా కసాయిలుగా మారుతున్నారు కన్న కొడుకులు. దీంతో ఓ వృద్దురాలు న్యాయ పోరాటానికి దిగింది. ఆర్డీవోను కలిసి ఫిర్యాదు చేసింది. కొడుకు.. కోడలు.. చూడడం లేదంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు బోరున విలపించింది ఓ తల్లి. కోదాడ పట్టణం గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది.

గ్రామానికి చెందిన సోమపంగు వెంకమ్మ, కోదాడ మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, రిటైర్ అయ్యింది. ఈ క్రమంలో తనకు ఉన్న ఒక్క గానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం తన కడుపుకి పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ, కన్నీరు మున్నీరుగా విలపించింది. పదవీ విరమణ పొందిన తరువాత, తనకు వచ్చే 35 వేల పించన్ కూడా తన వద్ద నుంచి కొడుకు కోడలు లాక్కుంటున్నారని వాపోయింది. అలాగే తన పేరు మీద ఉన్న ఎకరంన్నర భూమిని, తన ఇంటిని కూడా తన కోడలే తన పేరు మీదకు బలవంతంగా రాయించుకున్నదని భావోద్వేగానికి లోనయ్యారు.

తన తరఫున మాట్లాడడానికి వచ్చిన తన కూతుర్లపై కూడా కేసులు పెడుతున్నారని, తన తరఫున ఎవరు మాట్లాడడానికి వచ్చినా వాళ్ళపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ఆ తల్లి. తనకు న్యాయం చేయాలంటూ వెంకమ్మ కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న డీఏవో రామకృష్ణా రెడ్డికి తన గోడును వెళ్లబోసుకుని కాళ్లపై పడి వినతిపత్రం అందజేసింది.

Back to top button