తెలంగాణ

కృష్ణయ్యతో కలిసి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త వేదికలు పట్టుకొస్తున్నాయి. బీసీ వాదమే ఎజెండాగా కీలక నేతలు ఏకమవుతున్నారని తెలుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాలు బీసీ ఉద్యమ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడం సంచలనమైంది. ఏపీ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన కృష్ణయ్య.. ఇంకా నాలుగేళ్ల పదవి కాలం ఉన్నా ఎంపీ పదవిని వదులుకోవడం చర్చగా మారింది. బీజేపీ పెద్దలతో ఆయన టచ్ లో ఉన్నారని.. వాళ్ల డైరెక్షన్ లోనే ఎంపీ పదవికి రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. ఆర్ కృష్ణయ్య త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది.

కాని ఆర్ కృష్ణయ్య ఇంటికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రావడం ఆసక్తి రేపింది. కృష్ణయ్యతో చర్చలు జరిపిన మల్లు రవి.. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పార్టీలో చేరికపై కృష్ణయ్య ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మల్లు రవి కృష్ణయ్యను ఆహ్వానించారని తెలుస్తోంది. మల్లు రవి వెళ్లిన కాసేపటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రావడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఆర్ కృష్ణయ్యతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న తీన్మార్ మల్లన్న.. ఆయన ఏ ఒక్క పార్టీకే పరిమితమయ్యే వ్యక్తి కాదన్నారు. బీసీ బలమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న.. కృష్ణయ్యను పార్టీ వ్యక్తిగా చూడొద్దనడం చర్చగా మారింది.

తీన్మార్ మల్లన్న కొంత కాలంగా బీసీ గళం వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అయినా బీసీల విషయంలో తన వైఖరి కుండబద్దలు కొడుతున్నారు. బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బీసీలకు కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. బీసీ వాయిస్ వినిపిస్తూ తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వానికి, అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. అంతేకాదు ఇటీవలే ఓ బీసీ సమావేశంలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డే చివరి ఓసీ ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఇది రాసిపెట్టుకోవాలంటూ శపథం చేశారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చెబుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీనే రేవంత్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి కానీయనని చెప్పడం రాజకీయవర్గాలను విస్మయపరుస్తోంది.

బీసీ వాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్నకు ఆ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలు ఆయనను ఎంకరేజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆర్ కృష్ణయ్య కూడా బీసీ వాదంతో జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. తీన్మార్ మల్లన్నతో కలిసి బీసీ గళంతో కొత్త వేదిక ఏర్పాటు చేసే యోచనలో ఆర్ కృష్ణయ్య ఉన్నారంటున్నారు. తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య కలిసి బీసీ వాదంతో జనంలోకి వెళితే తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు రావడం ఖాయమంటున్నారు.

Back to top button