క్రైమ్ మిర్రర్ , తెలంగాణ బ్యూరో : దేశంలో గత పదేళ్లుగా బీజేపీ ఏం చేస్తుందో జనాలకు తెలుసు. ఏడు, ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టి.. ఆ పార్టీలను చీల్చి బీజేపీ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సొంతంగా కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అందులో ఒకటి తెలంగాణ కాగా.. మరొకటి కర్ణాటక. తెలంగాణలో 8 నెలల కింద కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. కన్నడలో ఏడాది దాటింది. అయితే కర్ణాటకపై బీజేపీ కన్నేసిందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే కాంగ్రెస్ కు భారీగా సీట్లు రావడంతో ఇంతకాలం ఆ పని చేయలేకపోయింది. ఇక తెలంగాణలో బోటాబోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. రేవంత్ సర్కార్ కూలడం ఖాయమనే ప్రచారం తొలిరోజు నుంచే సాగుతోంది. కూల్చుతారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గాలం వేశారని చెబుతారు.
తాజాగా కమలం పార్టీ తన మార్క్ పాలిటిక్స్ షురూ చేసింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎసరు పెడుతోంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ షాక్ ఇచ్చారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) స్కామ్‌లో కర్నాటక సీఎంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు మరికొందరిపై అవినీతి ఆరోపణలున్నాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి విచారణకు గవర్నర్ అనుమతులు మంజూరు చేయడం కర్నాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Read More : విలీనంపై మాట్లాడని కేసీఆర్,హరీష్.. రేవంత్ చెప్పిందే నిజమా!
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొంతకాలంగా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం, ఇప్పుడు గవర్నర్ విచారణకు అనుమతులు ఇవ్వడం వెనుక భారీ కుట్ర దాగి వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలాంటిదేదో జరుగుతుందని కర్నాటక సీఎం ముందే ఊహించారు. ఎందుకంటే అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలో సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విచారణకు ఆదేశించొద్దని కేబినెట్ తీర్మానించి గవర్నర్‌కు పంపింది. సీఎంకు ఇచ్చిన నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని తీర్మానంలో కేబినెట్ కోరింది. అయినప్పటికీ గవర్నర్ ఖాతరు చేయలేదు.
Read More : పేరుకే ఆయుర్వేదిక్ .. చేసేది అలోపతి.. ఇదీ కొత్తూరు వైద్యుడి వైనం
కర్ణాటక పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో ఏదైనా జరిగితే ఆ ప్రభావం తెలంగాణపై ఉంటుందనే టాక్ వస్తోంది. సిద్దరామయ్య రాజీనామాకు బీజేపీ పట్టుబడితే.. ఆ రాష్ట్రంలో సమీకరణలు మారిపోతాయని అంటున్నారు. కర్ణాటక ఘటనలతో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారని తెలుస్తోంది.