
క్రైమ్ మిర్రర్, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండా గ్రామంలో వడ్డీ బాధితుడి ఆత్మహత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అధిక వడ్డీ ఆశ చూపి పేదల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిన బాలాజీ నాయక్ అనే వ్యక్తి దందాకు బలైన బాధితుడు రామావత్ సరియా నాయక్ (37) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఈ ఘటనతో గ్రామస్థుల ఆగ్రహం భగ్గుమంది.
రమావత్ సరియా నాయక్ మృతి వార్త విన్న గ్రామ ప్రజలు ఆగ్రహంతో బాలాజీ నాయక్ నివాసంపై దాడి చేశారు. విలాసవంతమైన గృహంలో ఉన్న విలువైన వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులను ధ్వంసం చేశారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను బయటకు తీసి రోడ్డుపై వేసి నిప్పంటించారు. టీవీలు, సోఫాలు, కిటికీలు, డోర్లు విరగకొట్టారు. కొద్ది సేపటికే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్తతను నియంత్రించారు. నల్లగొండ ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు బలగాలను మోహరించారు. బాధిత కుటుంబ సభ్యులు, తండావాసులతో పోలీసులు చర్చలు జరిపి శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, బాలాజీ నాయక్ గత కొంతకాలంగా పది రూపాయల వడ్డీపై పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి వడ్డీ వ్యాపారం పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు గ్రామాల ప్రజలు తమ సొమ్మును ఆయనకు అప్పగించారు. మొదట కొంతకాలం వడ్డీ చెల్లించినా, తరువాత పూర్తిగా చెల్లింపులు నిలిపివేశాడని గ్రామస్తులు చెబుతున్నారు.
బాధితుడు రామావత్ సరియా నాయక్ కూడా అధిక వడ్డీ ఆశతో పరిచయస్తుల వద్ద అప్పు తీసుకుని సుమారు 30 లక్షల రూపాయలు బాలాజీ నాయక్‌కి ఇచ్చినట్లు తండావాసులు తెలిపారు. అనుకున్న లాభాలు రాకపోవడంతో పాటు, అప్పు ఇచ్చినవారు తమ డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడం వల్ల ఆందోళనకు గురైన సరియా నాయక్ ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్థలంలో క్రిమిసంహారక మందు సేవించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు.
ఆత్మహత్య వార్త తెలియగానే పలుగుతండాలో పరిస్థితులు వేడెక్కాయి. వందలాది గ్రామస్థులు బాలాజీ నాయక్ ఇంటిని ముట్టడి చేసి, మా డబ్బులు తిరిగి ఇవ్వాలి! నిందితుడిని అరెస్ట్ చేయాలి! అంటూ ఆగ్రహ నినాదాలు చేశారు. కొందరు ఆ ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసులు అదుపు చర్యలు చేపట్టినా, ప్రజా ఆగ్రహం తగ్గలేదు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నల్లగొండ డీఎస్పీ, పెద్దఅడిశర్లపల్లి సీఐ, ఎస్సైలు సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బాలాజీ నాయక్ ప్రవర్తనపై దశాబ్ద కాలంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయని, అతను ఏజెంట్ల ద్వారా పలు తండాలలో పెద్ద ఎత్తున డబ్బులు సేకరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ దందాకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇది సాధారణ వడ్డీ వ్యాపారం కాకుండా, పిరమిడ్ ఫైనాన్స్ స్కీమ్ తరహాలో ఉన్నదని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సరియా నాయక్ మృతి తర్వాత మరిన్ని బాధితులు బయటకు వస్తారని సమాచారం. పోలీసులు ఇప్పటికే బాధితుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ ఘటనతో జిల్లాలోని వడ్డీ వ్యాపారాలపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం, పలు గ్రామాల్లో తనిఖీలు ప్రారంభించింది.