తెలంగాణ

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. తెలంగాణలో విచిత్ర వాతావరణం

తెలంగాణలో కొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. ఉదయం విపరీతంగా ఎండ కాస్తుండగా.. సాయంత్రానికి మబ్బులు కమ్మేసి రోజూ ఏదో ఒక చోట వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది.

తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం ఎగువ ప్రాంతంలో మరో ఆవర్తనం ఏర్పడింది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం నాటికి తూర్పు – మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా -పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మంగళవారం రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హనుమకొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గాలుల వేగం గంటకు 30-40 కి.మీ ఉంటుందని చెప్పారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. మధ్యాహ్నం ఎండ కాసినా సాయంత్రానికి చల్లబడి వర్షం కురుస్తుందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.

Back to top button