Uncategorized

ఒవైసీ సీరియస్.. హైదరాబాద్ సీపీ అవుట్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆకస్మిక బదిలీ సంచలనంగా మారింది. 8 నెలల్లోనే సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని తప్పించడం వెనుక బలమైన కారణం ఉందనే చర్చ సాగుతోంది. వినాయక చవిత రోజున సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌‌ను నియమించింది. ప్రస్తుతం సీపీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇప్పటివరకు ఆ పోస్టులో ఉన్న విజయ్ కుమార్ కు.. సీవీ ఆనంద్ నిర్వహించిన ఏసీబీ డీజీ పోస్టును అప్పగించింది ప్రభుత్వం.పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

సీవీ ఆనంద్ కేసీఆర్ హాయంలో హైద‌రాబాద్ సీపీగా పని చేశారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయన్ను బదిలీ చేసింది. 2023 డిసెంబర్ 23న తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్.. తనదైన మార్క్ చూపించారు. సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీగా నియమించడంలో ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడటం లేదు. కాని సిన్సియర్ ఆఫీసర్ గా, ముక్కుసూటి మనిషిగా పేరున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు ఇంత తర్వగా తప్పించారన్నదే చర్చగా మారింది. కొత్తకోటను సీఎం రేవంత్ రెడ్డి ఏరికోరి హైదరాబాద్ సీపీగా నియమించారనే ప్రచారం అప్పట్లో జరిగింది.

విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే కొత్తకోట బీఆర్ఎస్ హయాంలో లూప్ లైన్ లో ఎక్కువ కాలం పనిచేశారు. అందుకే కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనను ఎందుకు మార్చారన్నది పోలీస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్ బ్రదర్స్ ఒత్తిడి వల్లే కొత్తకోటను మార్చారంటున్నారు. ఒవైసీ బ్రదర్స్ పంతం పట్టడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి.. కొత్తకోటను హైదరాబాద్ నుంచి మార్చారని అంటున్నారు.

హైదరాబాద్ సీపీగా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కొత్తకోట తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పోలీస్ స్టేషన్లలో పైరవీలను చాలావరకు తగ్గించగలిగారు. పాతబస్తీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓల్డ్ సిటీలో మిడ్ నైట్ జరిగే బైకు, కారు రేసింగులను నియంత్రించారు. మిడ్ నైట్ నడిచే షాపులను కొత్తకోట క్లోజ్ చేయించారు. అయితే ఒవైసీ సోదరులు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తిరిగి తెరిచి ఉంచేలా ఆదేశాలు ఇప్పించుకున్నారు. పాతబస్తీలో డెకాయి ఆపరేషన్స్ నిర్వహించిన కొత్తకోట.. గాల్లోకి కాల్పులు జరిపిన సందర్భాలు ఉన్నాయి. తమకు కొత్తకోట కొరకరాని కొయ్యగా మారాడని.. తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఒవైసీ బ్రదర్స్ సీరియస్ గా ఉన్నారట. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దలతోనూ సీఎంతో మాట్లాడించి కొత్తకోటను హైదరాబాద్ నుంచి పంపించి వేశారనే టాక్ పోలీస్ వర్గాల్లోనే సాగుతోంది. ఒవైసీ బ్రదర్స్ దెబ్బకే సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అవుట్ అయ్యారని అంటున్నారు.

Back to top button