కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ కు పెను గండంలో పడింది. హుస్సేన్ సాగర్ తో పాటు మూసీకి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్జ్ జారీ చేశారు అధికారులు. సాయంత్రం కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద వస్తోంది. రాత్రి మళ్లీ వర్షం కురిస్తే హుస్సేన్ సాగర్ డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లే. దీంతో మూసీ సమీప ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. ఈ రాత్రి ఎలా గడుస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.
ఇప్పటికే హుస్సేన్ సాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. ఇక జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఏ మాత్రం వర్షం వచ్చినా ఈ రెండు డ్యాం గేట్లు తెరవాల్సిన పరిస్థితి. అయితే సాయంత్రం 6 గంటల నుంచి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మూసీ పరివాహాక ప్రాంతంగా చెప్పుకునే శంకర్ పల్లి, మొయినాబాద్ ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది.ఏకాధాటిగా కురిసిన వర్షానికి ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదంతా గండిపేట ,హిమాయత్ సాగర్ లోకి వస్తోంది. దీంతో ఇప్పటికే నిండుకుండలా ఉన్న రెండు జంట జలాశయాల గేట్లు తెరిచేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ డ్యాం గేట్లు ఎత్తితో మూసీ ఉప్పొంగనుంది. దీంతో మూసీ ఏరియాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక హుస్సేన్ సాగర్ వరద మూసీకి తోడైతే చాలా లోతట్టు ప్రాంతాలకు గండం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రికి వర్షం తగ్గకపోతే నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చు.