తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అధికారం చేపట్టిన మూడు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలులోనికి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన వారికి 5 వందల రూపాయలకు గ్యాస్ అందిస్తున్నారు. వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా 2 వందల యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు.
మరో ఎన్నికల హామీకి రెడీ అయింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లలో జమ చేయబోతోంది. అక్టోబర్ 1 నుంచి రైతు భరోసా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముఖ్య పండగ….దసరా…బతుకమ్మ కావటంతో… ఈ పండగకు ముందే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 కేబినెట్ భేటీ ఉంది. అందులో రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది రేవంత్ కేబినెట్. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినా.. దాదాపు 40 శాతం మందికి అందలేదు. ఈ విషయంలో సర్కార్ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంది. దానుంచి బయటపడేందుకు పండగకు ముందే రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే రైతు భరోసాను గతంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చినట్లే అందరికి ఇస్తారా లేద కొర్రీలు పెడతారా అన్నదానిపై స్పష్టత లేదు. గుట్టలు, బీడు భూములకు రైతు భరోసా ఇవ్వమని ఇటీవలే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా ఇవ్వరని తెలుస్తోంది. ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఐదు ఎకరాలు కాదు 10 ఎకరాలు సీలింగ్ పెట్టాలనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వస్తోంది. ఈ విషయంలోనూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. రైతు రుణమాఫీ, గ్యాస్ సబ్సిడీ పథకాలను తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది రేవంత్ సర్కార్. రైతు భరోసా పథకానికి కూడా వైట్ రేషన్ కార్డును లెక్కలోకి తీసుకుంటారా లేదా అన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రైతు బంధులో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాలకు 5 వేల చొప్పున ఏడాదిలో రెండు సార్లు 10 వేల రూపాయలు ఇచ్చేవారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎకరాకు ఏడున్నర వేల చొప్పున ఏడాదికి ఎకరాకు 15 వేల రూపాయలు ఇవ్వనుంది.