తెలంగాణ

ఆ రైతులకు రైతు భరోసా కట్.. రుణమాఫీ కాని వారికి కష్టమే..!

తెలంగాణలో రైతు భరోసా పథకంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో మాట్లాడిన తుమ్మల.. అక్టోబర్ లో రైతు భరోసా నిధులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే గతంలో లాగా అందిరికి రాదన్నారు. మంత్రి తుమ్మల ప్రకటనతో రైతు బంధు ఇచ్చిన రైతుల్లో చాలా మందికి కట్ కానుంది. అంతేకాదు కౌలు రైతులకు ఎకరాకు 12 వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే కౌలు రైతుల విషయంలోనూ మంత్రి తుమ్మల స్పష్టత ఇచ్చారు. భూ యజమాని, కౌలు రైతులలో ఎవరో ఒకరికి భరోసా ఇస్తామన్నారు. వాళ్లిద్దరు మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకుంటేనే రైతు భరోసా డబ్బులు ఇస్తామని తేల్చి చెప్పారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు రైతు భరోసాకు అదే అమలు చేస్తే దాదాపు సగం మందికి రైతు భరోసా రాకుండా పోతుంది. ఇక ఐదెకరాలకు సీలింగ్ పెడతారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో మాత్రం మంత్రి తుమ్మల క్లారిటీ ఇవ్వలేదు.

రైతు భరోసాపై మంత్రి తుమ్మల చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలన అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు

తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయి

కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం

మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు.
నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ?

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..?
420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు ?
చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..?
అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..?
ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన..

తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ…నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు.
గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు.

ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు

జై కిసాన్
జై తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button