ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. వినాయక చవితిని పురస్కరించుకుని భారతదేశమంతటా ఘనంగా వేడుకలకు సిద్ధమయ్యారు.చిన్న పెద్దా తేడా లేకుండా గల్లీ గల్లీలో వినాయకుడిని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు వినాయకుడి ని కొలువుదీరేందుకు ఊరేగింపుగా గణనాథుడు వెళ్తుంటే మరో పక్క ఆకాశంలో ఓ అద్భుతమైన చిత్రం ఆవిష్కృతమైంది.ఆకాశంలో ఆ గణనాథుడి పోలికతో మేఘాలు కమ్మడంతో ఆ గణనాథుడే ప్రత్యక్షమయ్యాడంటూ జనాలు మొక్కుకున్నారు.
ఈ అద్భుతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలో సాయంత్రం ఆకాశం మేఘావృతమైంది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ సమయంలోనే ఆకాశంలో మబ్బులు గణనాథుడి పోలికలతో అమరిపోయి కనిపించాయి. ఆకాశం వైపు చూసిన జనాలకు మబ్బులు వినాయకుడి ఆకారంలో కనిపించడంతో అవాక్కయ్యారు. భగవంతుడే ఇలా కనిపించాడంటూ దండాలు పెట్టారు.
వినాయక చవితికి కొన్ని గంటల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన మహబూబాబాద్ లో పెద్ద సంచలనమైంది. గణనాథుడి పోలికతో ఉన్న మబ్బులను చూస్తూ అంతా తన్మయత్వం పొందారు. కొందరు ఆ వింతను తమ తమ ఫోన్లలో బంధించారు. కొద్ది సేపు ఉన్న ఆ వినాయక ప్రతిరూపం మేఘాల రూపంలో తేలిపోవడంతో సాక్షాత్తూ దైవ స్వరూపంగా భావిస్తున్నారు భక్తులు.