తెలంగాణ

అర్ధరాత్రి హైడ్రా ఆన్ డ్యూటీ.. 6 అంతస్థుల భవనం కూల్చివేత

సూపర్ పవర్స్ తో మరింత దూకుడు పెంచిన హైడ్రా.. అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగిస్తోంది. ఆదివారం ఉదయం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో కిష్టారెడ్డిపేటలో కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా.. అక్రమ నిర్మాణాలన్నీ నేలమట్టం చేసే వరకు ఆపరేషన్ కొనసాగించింది. మూడు అతిపెద్ద భవనాలను కూల్చేందుకు చాలా సమయం పట్టింది. అయినా అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి మొత్తం భవనాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఆరు అంతస్థుల భవనాన్ని అర్దరాత్రి తర్వాత కూల్చేశారు. ఇందుకోసం అధునాతన బుల్డోజర్లను ఉపయోగించారు. అక్కడి ప్రభుత్వ భూమిలో వెలిసిన మొత్తం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాకే హైడ్రా అధికారులు, బుల్డోజర్లు అమీన్ పూర్ నుంచి బయటికి వచ్చాయి.

ఆదివారం మొత్తం మూడు ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు. అమీన్ పూర్ చెరువును ఆక్రమించి నిర్మించిన 16 వాణిజ్య సముదాయాలు, షెడ్లను కూల్చేశారు. కిష్టారెడ్డిపేటలో చిన్న నిర్మాణాలతో పాటు మూడు పెద్ద భవంతులను నేలమట్టం చేశారు. కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించింది. చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా.. దీనిలో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసి..4 ఎకరాల భూమిని స్వానం చేసుకుంది.

Read More : అనుమతి ఇచ్చినోళ్లను అరెస్ట్ చేసి.. కట్టిన ట్యాక్స్ తిరిగి ఇచ్చేసి.. ఇండ్లను కూల్చు..

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ పురపాలక పరిధి పటేల్‌గూడ గ్రామానికి చెందిన 12వ నెంబరు ప్రభుత్వ సర్వే నెంబర్‌లో ఉన్న 25 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఇళ్లలో నివాసమున్న కుటుంబ సభ్యులను రెవెన్యూ, పురపాలక, పోలీసు శాఖల అధికారులు ఖాళీ చేయించారు. అనంతరం కూల్చివేశారు. ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

మరోవైపు కిష్టారెడ్డిపేట గ్రామ పరిధి 164 సర్వే నంబర్‌లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. 3 బహుళ అంతస్తుల భవనాల కూల్చివేసి ఒక ఎకరం భూమిని స్వాధీనం చేసుకుంది. దీంతో మొత్తం మూడు చోట్ల జరిపిన హైడ్రా కూల్చివేతల్లో 8 ఎరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా ప్రకటన విడుల చేసింది.

Back to top button